శిమ్లా హిమాచల్లో ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 11 మంది చనిపోయినట్లు గుర్తించగా.. 40 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారి కోసం భారత సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ డి ఆర్ఎఫ్ చెందిన 410 మందితో గాలింపు చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. జాగిలాలు, డ్రోన్లు సహా ఇతర పరికరాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా కులులోని నిర్మాంద్, సాయింజ్, మలానాతోపాటు మండీలోని పధార్, శిమ్లాలోని రాంపుర్ డివిజన్లలో వరదలు సంభవించాయి. మణికరన్ ప్రాంతంలోని మలానా-2 పవర్ ప్రాజెక్ట్ 33 మంది చిక్కుకోగా వారిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. శిమ్లాలోని రాంపుర్లో దాదాపు 20 నుంచి 25 ఇళ్లు కొట్టుకుపోగా, 30 మంది గల్లంతయ్యారు. మొత్తంగా 40మంది ఆచూకీ ఇంకా లభించలేదు.వరద నీరు కాస్త తగ్గడంతో రెస్క్యూ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు. మరోవైపు రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించిన నెల రోజుల్లోనే భారీ వర్షాల కారణంగా దాదాపు రూ.662 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. వర్ష సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు 79 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.