రేపటి నుంచి రెండో విడత రుణమాఫీ
అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు.
ఆగస్టు 15 లేదా ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేయాలని లక్ష్యం
తెలంగాణలో రెండో విడత రుణమాఫీ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎ భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాజరు కానున్నారు.రెండో విడతలో లక్షన్నర వరకు రైతుల రుణాలు మాఫీ చేయనున్నారు. ఈ నగదును రైతుల రుణ ఖాతాల్లో జమచేస్తారు. జులై 19న తొలి విడత రుణమాఫీ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని ఆధార్ నంబర్లు తప్పుగా ఉండటం, ఇతర సాంకేతిక కారణాల వల్ల కొందరికి పంపిణీ చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. రెండో విడత రుణమాఫీకి సంబంధించిన నిధులను సిద్ధం చేసిన ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా జమచేయనుంది. మొత్తం రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు 15 లేదా ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.