ప్రోత్సాహం అందిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు
శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ
చిన్నారులకు ఆసక్తి కలిగిన కళల్లో సరైన ప్రోత్సాహం అందిస్తే సత్ఫలితాలు సాధించవచ్చని, కళల్లో నైపుణ్యాలు మెరుగుపరుచుకునే దిశగా కృషి చేయాలని శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ సూచించారు. పట్టణంలోని శ్రీ నవశక్తి దుర్గా పీటం ఆవరణలో శనివారం నిర్వహించిన మువ్వల సవ్వడి మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల కేంద్రం ఆధ్వర్యంలో మువ్వల సవ్వడి మహోత్సవం, గజ్జలు, తాంబూలం పూజ కార్యక్రమాలను నిర్వహించగా… నృత్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, వారి తల్లితండ్రులు హాజరయ్యారు. ముందుగా కార్యక్రమ అతిథులకు సాదరంగా స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గజ్జలు, తాంబూలం పూజ జరపగా… చిన్నారులు భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాట్య గురువు మిట్టు రవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.