మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..
40 వేల దళిత కుటుoబాలకు ₹10లక్షల చోపున్న కెసిఆర్ ఆర్థిక సాయం అందించారు
కాంగ్రెస్ పార్టీ దళితబంధు కింద 12 లక్షలు అందిస్తామని చెప్పి బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మరోసారి మోసం చేసింది
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫైర్
బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వం లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వంలో మా సమస్యలు ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ శాఖలకు మంత్రి లేకపోవడం.. వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది రాష్ట్ర ప్రజలకు అర్థమైతుంది. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ వాటి అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేవు. 40 వేల దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున కేసీఆర్ ఆర్థిక సాయం అందించాం. కాంగ్రెస్ పార్టీ దళితబంధు కింద 12 లక్షలు అందిస్తామని చెప్పి బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మోసం చేసింది. విద్యా జ్యోతి పథకం పేరుతో 10 పాసైన విద్యార్థులకు 10 వేలు, 12 పాసైన విద్యార్థులకు 15 వేలు, డిగ్రీ పాసైన విద్యార్థులకు 25 వేలు, పీజీ పాసైన విద్యార్థులకు రూ. లక్ష, పీహెచ్ఎ పాసైన విద్యార్థులకు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పి కేటాయింపులు చేయలేదు. ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలి. 15 ఏండ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. వాటికి కేటాయింపులు లేవు అని అనిల్ జాదవ్ తెలిపారు.
ఎస్టీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వాటి ఊసే లేదు. కార్పొరేషన్లకు 25 లక్షల చొప్పున నిధులు ఇస్తామన్నారు. కానీ నిధులు కేటాయించలేదు. ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే గిరిజన ఆదివాసీ బిడ్డలకు ఎంతో కష్టమని చెప్పి కల్యాణలక్ష్మి కింద లక్ష కట్నం అందించి కేసీఆర్ ఆదుకున్నారు. ఈ పథకానికి అదనంగా తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చి 8 నెలలైనా అమలు చేయలేదు అని అనిల్ జాదవ్ గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కుల గుణన చేసి మైనార్టీలకు కూడా సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. మైనార్టీ బడ్జెట్ 4 వేల కోట్లకు పెంచి సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. కానీ 2258 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు బడ్జెట్లో. మైనార్టీల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని ఆయన పేర్కొన్నారు.
జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ అతిగతీ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. గ్రూప్-1లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామన్నారు. గ్రూప్- 2లో 2 వేలు, గ్రూప్- 3లో 3 వేల పోస్టులు పెంచుతామన్నారు. కానీ అమలు చేయడం లేదు. ఉద్యోగాల్లో కేసీఆర్ 95 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఎస్టీ రిజర్వేషన్లు కూడా కేసీఆర్ పెంచారు. స్పోర్ట్స్ స్కూల్స్లో స్టాఫ్ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలి. అన్ని గురుకులాలు, మోడల్స్ స్కూల్స్లో అదనపు గదులను నిర్మాణం చేయాలి అని ప్రభుత్వాన్ని అనిల్ జాదవ్ కోరారు.