కండ్లు పొడిబారడాన్ని కెరాటోకంజంక్టివైటిస్ సిక్కా అని కూడా అంటారు. కండ్లు తేమగా ఉండటానికి అశ్రుగ్రంథుల నుంచి తగినన్ని నీళ్లు విడుదల కాకపోవడం, విడుదలైనా అవి తొందరగా ఆవిరి కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఇది……… కండ్లు పొడిబారడం, దురదగా ఉండటం, ఎర్రబడటం, గరగరగా అనిపించడం, కొన్నిసార్లు చూపు మసకగా ఉండటం లాంటి ఇబ్బందులకు దారితీస్తుంది.
వయసు పెరగడం, హార్మోన్లలో మార్పులు, ఎక్కువకాలం పాటు స్క్రీన్లకు అతుక్కుపోవడం, వాతావరణం పొడిగా ఉండటం, కొన్ని ప్రత్యేకమైన వైద్య సమస్యలు ఈ డ్రై ఐస్ సమస్యకు కారణాలు. కాగా, భారతీయ పురాతన వైద్య సంప్రదాయం ఆయుర్వేదంలో డ్రై ఐస్ లక్షణాలను తగ్గించడానికి, కంటిచూపు మెరుగుపర్చడానికి కొన్ని సహజమైన పరిష్కారాలు ఉన్నాయి.
కలబంద :
కలబందలో మాయిశ్చరైజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కొంచెం కలబంద గుజ్జు (జెల్) తీసుకుని, దాన్ని కంటి చుట్టూ అప్లయ్ చేస్తే పొడిబారే సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది. అయితే, ఈ గుజ్జు కండ్లకు తాకకుండా జాగ్రత్త వహించాలి.
శుభ్రంగా ఉన్న గుడ్డను తీసుకుని చల్లటి రోజ్ వాటర్లో ముంచాలి. దాన్ని ఓ పది పదిహేను నిమిషాలపాటు కండ్లు మూసి, కనురెప్పలపై ఉంచాలి. రోజ్ వాటర్కు కండ్లను చల్లబరిచే, మంట నుంచి ఉపశమనం కలిగించే గుణాలు ఉంటాయి. దీంతో కండ్లు పొడిబారడం, మంట తగ్గుతాయి.
కీరదోస :
మూసిన కండ్లపై కీరదోస చక్రాలను ఉంచినా కూడా డ్రై ఐస్, మంట సమస్యల నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు, నీళ్ల శాతం ఎక్కువగా ఉండే కీరదోస చక్రాలను కండ్ల మీద ఓ 20 నిమిషాల వరకు ఉంచాలి.
గానుగ పట్టించిన ఆముదపు నూనెను ఒకచుక్క తీసుకుని కంటి చుట్టూ గుండ్రంగా రుద్దాలి. ఆముదపు నూనెకు లూబ్రికేటింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి డ్రై ఐస్ సమస్యను తగ్గిస్తాయి.
నిర్ణీత సమయాల వ్యవధిలో కనురెప్పలు కొట్టడం కూడా కంటికి తగినంత తేమను అందిస్తుంది. కండ్లు పొడిబారడాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కాలంపాటు స్క్రీన్లను చూసేవాళ్లు ఇలా చేయడం ఎంతో మంచిది.