ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం (Finance)

•ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి
* టీజీబి మేనేజర్ వెంకటేశ్వరరావు

ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలన్నారు. బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడే బ్యాంకు సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. సామాజిక భద్రత పథకాలు కుటుంబాలకు భరోసాగా ఉంటాయని అన్నారు. అనంతరం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం (సిఎఫ్ఎల్) కౌన్సిలర్స్ కమలాకర్, సత్యనారాయణ లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థిక ఖర్చులకు అనుగుణంగా బడ్జెట్ ప్రణాళిక రూపొందించుకొని డబ్బులు పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. బ్యాంక్ అకౌంట్లు లేని వారు జీరో అకౌంట్ అయినా తీసుకోవాలని సూచించారు. మరియు అదే విధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, ఫసల్ బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తుల ఫోన్లకు, మెసేజ్లకు స్పందించ వద్దని, ఓటీపీలను చెప్పవద్దని, మొబైల్ కు వచ్చే తెలియని లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. సైబర్ నెలలో రోజురోజుకు కొత్త రకపు మోసాలతో ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారన్నారు. ఒకవేళ మీరు మోసపోయారని ఎలాంటి అనుమానం వచ్చిన దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలని, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *