దానం నాగేందర్ వెంటనే రాజీనామా చేయాలి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి డిమాండ్
రెండు రోజుల నుంచి అవమానకరంగా మాట్లాడుతున్నారు.
రూ.25 కోట్లతో కేసీఆర్ జోడేఘాట్ ను అభివృద్ధి చేసి చూపించారు.
ఎమ్మెల్యేలను శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసభ్యపదజాలంతో దూషించడం పట్ల బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు, శరం ఉంటే దానం నాగేందర్ రాజీనామా చేయాలని కోవా లక్ష్మి డిమాండ్ చేశారు. ఇవాళ శాసన సభలో దానం నాగేందర్ మాట్లాడిన భాష సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉన్నదని మండిపడ్డారు. నిన్న స్పీకర్ తమకు చాలా నీతులు చెప్పారని.. ఇవాళ దానం నాగేందర్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూస్తామని అన్నారు. దానం నాగేందర్పై యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు.
శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నాయకులు రెండు రోజుల నుంచి అవమానకరంగా మాట్లాడుతున్నారని కోవా లక్ష్మి తెలిపారు. నిన్న మహిళలను అవమానించారని.. ఇవాళ దానం నాగేందర్ అసభ్యంగా మాట్లాడరని పేర్కొన్నారు. రూ.25 కోట్లతో కేసీఆర్ జోడేఘాట్ ను అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అవగాహన లేకుండా జోడేఘాట్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్కే ఫామ్ హౌస్ ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేవా అని ప్రశ్నించారు.
దానం నాగేందర్కు సిగ్గు శరం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని కోవా లక్ష్మి డిమాండ్ చేశారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ అంటే దేవాలయమని.. అలాంటి దేవాలయంలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని అన్నారు.