గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్ లో ఆ పార్టును అస్సలు తినవద్దు..!
Health tips : ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం చికెన్.
నాన్ వెజ్ ప్రియులు అత్యంత ఇష్టంగా దీన్ని తింటారు. డైట్ చేసేవాళ్లు తమ డైట్లో చికెన్ను భాగం చేసుకుంటారు. అయితే వాళ్లు ఫ్రైడ్ చికెన్ కాకుండా గ్రిల్డ్ చికెన్ తింటారు. అయితే ఈ చికెన్లో ఫారమ్ చికెన్ కంటే నాటు కోడి చికెన్ మంచిది. అయితే నాటు కోళ్ల లభ్యత తక్కువగా ఉండటం, ధర అధికంగా ఉండటం లాంటి కారణాల వల్ల ఎక్కువ మంది ఫారమ్ చికెన్కో మొగ్గు చూపుతారు. ఈ ఫారమ్ చికెన్లో కొన్ని భాగాలు తినకూడదని, అవి ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి చికెన్లో ఆరోగ్యానికి మంచివి కానివేవో ఇప్పుడు తెలుసుకుందాం..
- చర్మం
చికెన్లో ఆరోగ్యానికి అత్యంత కీడు చేసేది చర్మం. కోడి చర్మం తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దానిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అది గుండెకు ప్రమాదకరం. అంతేగాక చికెన్ తాజాగా ఉండేందుకు రసాయనాలు కలిపే అవకాశం ఉంది. కాబట్టి చర్మాన్ని తినడంవల్ల ఆ రసాయనాలు కూడా మన బాడీలో చేరుతాయి. ఇది రకరకాల అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే కార్డియాలజిస్టులు చికెన్ తక్కువగా తినాలని, తిన్నా స్కిన్ అస్సలు తినకూడదని సలహా ఇస్తారు. చికెన్ స్కిన్లో అసంతృప్త కొవ్వులు, కేలరీలు ఎక్కువగా ఉంటాయని, అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది ప్రమాదకరమని చెబుతుంటారు.
- కోడి చర్మంలో మంచి కొవ్వులూ ఉన్నాయా..?
కోడి చర్మం ఆరోగ్యానికి ప్రమాదకరమే అయినా అత్యంత అరుదుగా తీసుకుంటే మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కోడి చర్మంలో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వులు ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. కాబట్టి గుండె జబ్బులు లేనివాళ్లు అరుదుగా నెలకు ఒకటి రెండు సార్లు స్కిన్తో కూడిన చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిదేనట. కానీ అంతకు మించితే మాత్రం శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉందట.
- చికెన్ ఏ పార్టులో కొవ్వు తక్కువ..?
చికెన్ బ్రెస్ట్ భాగంలో కొవ్వు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కోడి ఛాతి మాంసం ఆరోగ్యానికి మంచిది. ఇది బరువును నియంత్రించడంలో కూడా తోడ్పడుతుంది. కండరాల పుష్టికి కూడా చికెన్ బ్రెస్ట్ మంచిది. చికెన్ తొడ మాంసం కూడా మంచిదే అయినా బ్రెస్ట్ మాంసం కంటే శ్రేష్ఠం కాదు. ఎందుకంటే బ్రెస్ట్ మాంసం కంటే తొడ మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చికెన్ వింగ్స్ కూడా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కేలరీలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని ఫ్రైస్ లాగా కాకుండా గ్రిల్ చేసుకుని తినడం మంచిది.