పెండ్లయిన యువకుడి ప్రేమాయణం
బెదిరించిన ప్రియురాలు.. భయంతో ఆత్మహత్య
ప్రియురాలితో ఫోన్ మాట్లాడుతూ భార్యకు దొరికిన భర్త..
తనను దూరం పెడితే చనిపోతానంటూ
బెదిరించిన ప్రియురాలు
భయంతో యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త
సాఫీగా సాగిపోతున్న సంసారంలో ప్రవేశించిన మూడో మనిషితో ఆ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పటికీ.. బయట ప్రియురాలితో చాటుమాటుగా ప్రేమాయణం సాగించిన ఓ యువకుడు తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయిన అతడు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్నగర్కు చెందిన కె.రమేశ్ (35) ఓ యువతిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. రమేశ్ కారు డ్రైవర్. ఇటీవల మరో యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భార్యా పిల్లలు ఉన్నప్పటికీ ప్రియురాలిని కలుస్తున్నాడు.
రమేశ్ ప్రియురాలితో ఫోన్ మాట్లాడుతూ భార్యకు దొరికిపోయాడు. భార్య నిలదీయడంతో ఫోన్స్విచ్ఛాఫ్ చేశాడు. ఆ తర్వాత.. తనను దూరం పెడితే ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రియురాలు వీడియోలు పంపింది. భయపడిన రమేశ్ మంగళవారం ఇంట్లోని బాత్రూమ్లో ఉన్న యాసిడ్ తాగి పడిపోయాడు. దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. బలవన్మరణానికి పాల్పడ్డ రమేశ్ మృతదేహాన్ని గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.