Muda Scam | బెంగళూరు, ఆగస్టు 29: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం భూకేటాయింపు కుంభకోణంలో మరింతగా చిక్కుకుంది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) భూకేటాయింపు వ్యవహారంలో సిద్దరామయ్య కుటుంబానికి భారీ లాభం దక్కిందని ఆరోపణలు చేస్తూ రిపబ్లిక్ మీడియా ఓ కథనం ప్రసారం చేసింది. ఈ పత్రాల ప్రకారం, సిద్ధరామయ్య భార్య పార్వతి పేరు మీద ఉన్న కేసరి గ్రామంలోని 3.16 ఎకరాల భూమిని ముడా తీసుకుంది.
ఈ భూమిని 2004లో పార్వతి సోదరుడు మల్లికార్జున ఓ రైతు వద్ద కేవలం రూ. 5.95 లక్షలకు కొనుగోలు చేసి, 2005లో పార్వతికి బహుమతిగా ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. సిద్ధరామయ్య కుటుంబం ఈ భూమిని ముడాకు ఇచ్చి ప్రతిగా 65 కోట్ల విలువైన ప్లాట్లను పొందిందని ఆరోపణలు ఉన్నాయి.
విరుద్ధ లేఖల వివాదం
సిద్ధరామయ్య ఇటీవల తన భార్య ఎక్కడా స్థలాలు కోరలేదని చెప్పినప్పటికీ, 2014లో ముడాకు పార్వతి రాసిన లేఖ ఒకటి బయటపడింది. ఈ లేఖలో కేసరి గ్రామంలోని భూమికి బదులుగా ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలు కావాలని ఆమె కోరారు. ఆ లేఖలో పేర్కొన్న ప్రాంతాల పేర్లు తర్వాత వైట్ నర్డ్‌తో తుడిపేయబడ్డాయి, ఇది మరింత అనుమానాలకు తావిస్తోంది.
యతీంద్ర సిద్ధరామయ్య పాత్ర
2020లో ముడా సమావేశంలో యతీంద్ర సిద్ధరామయ్య ఎమ్మెల్యే హోదాలో పాల్గొని ప్లాట్ల కేటాయింపులో కీలక పాత్ర వహించారని ఆర్టీఐ పత్రాలు వెల్లడిస్తున్నాయి. 3,500 స్థలాలు ఉన్నప్పటికీ, ఖరీదైన విజయనగర్‌లోనే స్థలాలు కేటాయించడం, సిద్దరామయ్య కుమారుడి పాత్రపై ఇప్పటికే పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలు సిద్దరామయ్యపై ఆరోపణలను మరింత బలపరుస్తున్నాయి.