రైతుల రుణమాఫీపై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు అన్యాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట రైతుల బాధలను నేరుగా చూసి, వారి ఆందోళనకు మద్దతు పలికారు.
పాయల్ శంకర్ మాట్లాడుతూ, “రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి, ఇప్పుడు ఆంక్షలు విధించడం మోసమే,” అని అన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1500 మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉన్నప్పటికీ, కేవలం 220 మందికే రుణమాఫీ జరగడం దారుణమని అన్నారు.
పిర్యాదులను స్వీకరించి, ఆన్లైన్లో దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. “రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ చేయడం శోచనీయమని,” పాయల్ శంకర్ అన్నారు. కొందరికి రూ. 50,000, మరికొందరికి రూ. 1,50,000, ఇంకొందరికి రూ. 2 లక్షల రుణమాఫీ జరగకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అధికారులు రుణమాఫీలోని వసూళ్లను సరిచేయాలని, అర్హులైన ప్రతీ రైతుకూ బేషరతుగా రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. “ఆంక్షలు సడలించి, రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని,” అన్నారు.
అనంతరం, బ్యాంక్ సిబ్బందిని అడిగి రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని సూచించారు. ఈ ఆందోళనలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మండల నాయకులు సంతోష్ దయాకర్, అకుల ప్రవీణ్, రాందాస్, ముకుంద్ దత్తు, నరేష్, అనిల్, ఆదినాథ్, సుభాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.