ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దేశ ప్రజల హృదయాలకు చేరువయ్యారు. స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ, వందల ఏళ్ల బానిసత్వం నుండి దేశం ఎలా బయటపడిందో, ఆ సమరంలో స్త్రీలు, యువకులు, గిరిజనులు సైతం తమ ప్రాణాలను అర్పించిన ఘన చరిత్రను ప్రస్తావించారు.
1857 నుండి స్వతంత్రం వరకు జరిగిన పోరాటాలు మనకు స్ఫూర్తిగా నిలవాలని, అప్పట్లో 40 కోట్ల మంది పోరాటం చేసి స్వాతంత్రం సాధించారు. ఇప్పుడు మనం 140 కోట్లమంది ఉన్నాం. ఒక తీర్మానం, ఒక కల తో ముందుకు సాగితే, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ను సృష్టించడం అసాధ్యం కాదని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రకృతి వైపరీత్యాలు, వినాశకర ప్రమాదాలు దేశానికి ఎన్నో సవాళ్లు సృష్టించినా, మనం ఒకతాటిపై నిలబడి ముందుకు సాగుతున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా లక్షలాది కుటుంబాలకు కుళాయి నీరు అందుతుందని గర్వంగా వివరించారు.
ఉగ్రవాదం పై దేశం తీసుకున్న సర్జికల్ స్ట్రైక్‌లు ప్రజల గర్వాన్ని పెంచాయి అని మోదీ పేర్కొన్నారు. భారత దేశానికి మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రజలపై కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
విద్యా విధానం మాత్రమే కాకుండా, సైన్స్ అండ్ టెక్నాలజీ లో కూడా దేశం ప్రగతి సాధిస్తోందని, 1500 పైగా చట్టాలు రద్దు చేసి ప్రజల జీవితాలను సులభతరం చేశామని మోదీ గర్వంగా చెప్పుకొచ్చారు.
కరోనా సమయంలో కూడా మన ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచిందని, భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. స్వతంత్ర భారతదేశం కల సాకారం చేయడానికి ప్రతి పౌరుడు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.