TGPSC | హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పాలిటెక్నిక్ Polytechnic లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచినట్లు టీజీపీఎస్సీ ప్రకటించారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో పిలిచారు.
సెప్టెంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ప్రతి రోజు ఉదయం 10:30 గంటలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వెబ్ ఆప్షన్లు సెప్టెంబర్ 19 నుంచి 28వ తేదీ వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. కమిషన్ వెబ్సైట్ నుంచి చెక్ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. చెక్ లిస్ట్లో ఉన్న ప్రతి పత్రంపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించుకోవాలని, తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు.