RIMS | రిమ్స్ ఆసుపత్రి మరియు కళాశాలలో వైద్యుల భద్రత అత్యంత ముఖ్యమైనదని, జిల్లా ఎస్పీ గౌష్ ఆలం చెప్పారు. గురువారం నాడు ఆయన రిమ్స్ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్, మరియు వైద్య విద్యార్థుల వసతి గృహాలను సందర్శించి భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. సీసీటీవీ కెమెరాలు ప్రతీ కీలక ప్రదేశంలో ఉండాలని, వాటి ద్వారా భద్రత మరింత మెరుగుపడుతుందని సూచించారు.
కళాశాల మరియు హాస్టల్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండాలని, అన్ని విధాలుగా భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.
వైద్యులకు రక్షణగా సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలని, అత్యవసర సమయాల్లో పోలీసు సిబ్బంది వచ్చేంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పేర్కొన్నారు. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో శిక్షణ ఇస్తామని తెలిపారు.
రిమ్స్ కళాశాలలో పోలీస్ అవుట్ పోస్ట్ లో 24 గంటలు పనిచేసే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఏర్పాటు చేసి, అర్ధరాత్రి సమయాల్లో కూడా రిమ్స్ పరిసరాలను ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపారు. రెండు షిఫ్ట్లలో అదనంగా ప్రత్యేక పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.