శ్రీశైల క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా కనిపించింది. వరుసగా వారాంతపు సెలవులు రావడంతోపాటు శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తిన విషయం తెలిసిందే. దాంతో స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు.. జలాశయం అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో వివిధ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు, పర్యాటకులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులకు సర్వదర్శనాలు కల్పించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.
స్వామివారి గర్భాలయ అభిషేకాలు, సర్శదర్శనాలు, అమ్మవారి శ్రీచక్ర కుంకుమార్చనల్లో భక్తులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆలయానికి వస్తున్న భక్తులు దేవస్థానం సిబ్బందితో సహకరించాలని ఈవో పెద్దిరాజు కోరారు. రాత్రి సమయంలో వచ్చిన భక్తులకు కనీస వసతి సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడం ఇబ్బందులుపడాల్సి వస్తుందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రైవేటు హోటల్స్ కాకుండా దేవస్థానం ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అల్పాహారాన్ని అందజేయాలని భక్తులు కోరారు.