ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధం (Ukraine-Russia War) (Indians) లో కొంత మంది భారతీయులు మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. వీరిలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. హరియాణా (Haryana)కు చెందిన 22 ఏళ్ల రవి మౌన్.. రష్యన్ ఫ్రంటైన్లో పనిచేస్తూ మరణించాడని తమకు సమాచారం అందినట్లు అతడి కుటుంబసభ్యులు వెల్లడించారు.అతడి మృతిని మాస్కోలోని భారత ఎంబసీ ధ్రువీకరించినట్లు రవి సోదరుడు అజయ్ మౌన్ మీడియాకు తెలిపారు. అయితే, ఎలా మరణించాడన్న దానిపై తమకు పూర్తి సమాచారం లేదన్నారు. రవాణా విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన సోదరుడిని ఓ ఏజెంట్ రష్యా తీసుకెళ్లినట్లు అజయ్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలోనే అతడు మాస్కో వెళ్లాడని చెప్పారు. ఆ తర్వాత అతడిని బెదిరించి బలవంతంగా రష్యా సైన్యం (Russia Army)లోకి తీసుకున్నారని ఆరోపించారు.“ఈ ఏడాది మార్చి 12వ తేదీ వరకు రవి మాతో టచ్లోనే ఉన్నాడు. వారం రోజుల నుంచి యుద్ధ భూమిలో విధులు నిర్వర్తిస్తున్నానని ఆ రోజు మాతో చెప్పాడు. ఆ తర్వాత రవి నుంచి ఎలాంటి సమాచారం లేదు. అప్పటినుంచి అతడి కాంటాక్ట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. చివరకు జులై 21న మాస్కోలోని భారత ఎంబసీకి మెయిల్ చేశా. వారు రష్యన్ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత రవి మృతి చెందినట్లు తెలిసింది. ఆ వార్త విని మా గుండె బద్దలైంది” అని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తంచేశారు.