సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వల్ల ఉత్తరప్రదేశ్లో మహిళల భద్రతకు ‘తీవ్రమైన ముప్పు పొంచి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. మహిళలపై దాడుల కేసుల్లో ఉన్న వారంతా సమాజ్ వాదీ పార్టీ నేతలేనని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలలపై లైంగిక దాడులను నివారించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందా? అని యూపీ అసెంబ్లీలో ఎస్పీ సభ్యుడు రాగిణి సొంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యోగి ఆదిత్యనాథ్ ఈ ఆరోపణ చేశారు.
‘మహిళల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సీరియస్ గా వ్యవహరిస్తున్నది. దాని ఫలితంగానే మహిళలు, బాలలపై దాడుల కేసులు నిరంతరం తగ్గుతున్నాయి. నేరస్తుల మనస్సుల్లో భయాందోళన కలిగించాం’ అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మహిళల భద్రత పట్ల పూర్తిగా అప్రమత్తంగా, చురుగ్గా వ్యవహరిస్తున్నదని, ప్రతి కూతురు, వ్యాపార వేత్తకూ భద్రత కల్పించేందుకు కట్టుబడి పని చేస్తుందన్నారు. 2017లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడమే తమ తొలి చర్య అని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడాన్ని తొలుత వ్యతిరేకించిందే సమాజ్ వాదీ పార్టీ అని ఆరోపించారు. 2016లో ఎస్పీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాల నేరాలు తగ్గుతూ వచ్చాయన్నారు.