తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సూపర్స్టార్ కృష్ణ బావ, మహేష్ బాబు మామ ఉప్పలపాటి సూర్య నారాయణ కన్నుముశాడు. గుండెపోటుతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.
సూర్యనారాయణ బాబు కృష్ణా జిల్లాలోని రిమ్మనపూడి అనే గ్రామంలో జన్మించారు. కృష్ణ రెండవ చెల్లి లక్ష్మీ తులసిని పెళ్లి చేసుకున్న అతడు పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. నిర్మాతగా ఆయన తెలుగుతో పాటు కన్నడ, హిందీలో భాషల్లో 24 సినిమాలను నిర్మించాడు. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కురుక్షేత్రం, మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడి సినిమాలు చేసిన సూర్యనారాయణ మహేష్ బాబు, రమేశ్ బాబులతో ‘బజారు రౌడీ’ సినిమాను నిర్మించారు. ఇంకా ఇవే కాకుండా అల్లుడు దిద్దిన కాపురం, శంఖారావం, అన్నదమ్ముల సవాల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ఇండస్ట్రీకి అందించాడు. ఇక సినిమాతో పాటు రాజకీయాల్లో కూడా తన లక్ ను పరీక్షించుకున్నారు. అప్పట్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్టీఆర్ పై పోటీ చేసి వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికలలో ఎన్టీఆర్ పై చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అనంతరం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.