పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన దిశగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన అనంతరం రాష్ట్రంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం స్పందించడం, జూనియర్ డాక్టర్లు 21 రోజులుగా నిరసనలు చేయడం కలకలం రేపాయి.
ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, పోలీసులు కఠినంగా వ్యవహరించడం ఉద్రిక్తతలను మరింత పెంచాయి. బెంగాల్ తగలబడితే, ఢిల్లీ కూడా తగలబడుతుంది అంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ మండిపడేలా చేశాయి. ఈ వ్యాఖ్యలను దేశ వ్యతిరేకంగా అభివర్ణిస్తూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజందార్ ఫిర్యాదు చేశారు.
రాష్ట్రపతి పాలనకి బీజేపీ పట్టుబట్టి ఉండడం చూస్తుంటే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఇటీవల రాష్ట్రపతి, హోంమంత్రిలను కలవడం, అనంతరం “రాష్ట్రంలో పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయి” అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కాల్ రికార్డులు కూడా ఈ అంశాన్ని మరింత ముదిర్చాయి. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను దవాఖాన అధికారులు దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు కాల్ రికార్డింగ్స్ ద్వారా బయటపడ్డాయి. బాధితురాలి తండ్రికి ఆగస్టు 9న ఆసుపత్రి నుంచి వచ్చిన కాల్స్, అతనికి తెలియజేసిన మరణవార్త తీవ్రంగా దుమారం రేపింది.
ఈ పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు తక్కువగా లేవని అభిప్రాయపడుతున్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఢిల్లీ సుప్రీం కోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ కూడా ఫిర్యాదు చేయడం, పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది.