ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని
తిర్పెల్లి కాలనీ సమీపంలో గల గంభీర్ హోటల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే యువకుడిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుడు తిర్పెల్లి కాలనీకి చెందిన సంద విట్టల్ గా కాలనీవాసులు గుర్తించారు. కాగా విట్టల్ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో పరిస్థితి విషమించి మృతి చెందారు. దీంతో యువకుడు నివసిస్తున్న కాలనీకి చెందిన పలువురు కాలనీవాసులు యువకుడిని ఢీ కొట్టి వెళ్లిన గుర్తుతెలియని వాహనాన్ని గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా చనిపోయిన యువకుడికి వికలాంగుడైన నాన్న, వృద్ధురాలైన అమ్మ తో పాటు భార్య, ఐదేళ్ల కూతురు ఉన్నారని, ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని, వారిని ఆదుకోవాలని పోలీసులను కోరారు. ఇది ఇలా ఉంటే యువకుడు ఉదయం మృతి చెంది గంటలు గడుస్తున్నా కనీసం పోస్టుమార్టం చేసేందుకు పోలీసులు సమయానికి రాలేదని, వారి తీరుపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతదేహాన్ని తరలిస్తున్న పార్థివ వాహనాన్ని కలెక్టర్ చౌరస్తాలో గల టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిలిపివేసి రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు.ఇది గమనించిన టూ టౌన్ సిఐ సిహెచ్ కరుణాకర్ రావు వచ్చి ఆందోళనకారులను సముదాయించి నిరసనను విరమింప చేశారు. కాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి, మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. దీంతో వారు ఆందోళన విరమించి వెళ్లిపోయారు. అంతకుముందు విఠల్ మృతదేహానికి పంచనామా నిర్వహించి, వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.